సాగర దేహం
విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా
నడిచే నీటి దేహాన్నయిపోతాను
పలకరింపుగా ఎవరు తాకినా
వాళ్ళ చేతులే కాదు, మనసులు కూడా తడిసిపోతాయి.
నేను సముద్రాన్నాయితే.....
సముద్రం నా ముందు కూర్చుంటుంది.
వేల సంవత్సరాల జ్ఞాపకాలేవో....ఇసుక రేణువులై
నాలో మేట వేస్తుంటే
తరంగాలు తరంగాలుగా నేను పడి లేస్తుంటాను
సముద్రం పకాలున నవ్వుతూ
పాత ముచ్చట్ల మూట విప్పుతుంది
సముద్రం దగ్గరకు వెళ్ళినప్పుడల్లా
ఇసుక పొరల్లో శతాబ్దాల నాటి
ఏ భగ్నప్రేమికుడి పాదముద్రనో ఆయిపోతాను
ఇసుక మీద ఏ మహాకవో ర్రాసిన
వాక్యం తాలూకు తడి తడి ఆనవాలుగా మారిపోతాను
పక్కనే ఉన్నా.......
దోస్తులు తీరమంతా వెదుకుతారు నా కోసం
నేను మాత్రం
ఆది అంతాల మధ్య కడలిపై తేలియాడే
మనిషి భౌతికకాయంనుండి వీచే
నైతికానైతిక నిశ్శబ్ద వాయుశబ్దాన్ని వింటాను
సముద్రం ఏదో చెప్పాలనుకుంటుంది నాకు
కాదు, నేనే ఏదో వినాలనుకుంటాను
సముద్రం నాకు సంగీతం
సముద్రం నాకు సాహిత్యం
విశాఖనుండి ఏం తెచ్చావని అడుగుతుంది తను
పద్యం తెచ్చానని
నిలువెత్తు నీటి బొట్టునై
ఆమె పాదాల ముందు చిటుక్కున చితికిపోతాను.
విశాఖ వెళ్ళొచ్చినప్పుడల్లా ఇంతే
ఎక్కడ నిలబడ్డా..
అందరి మీదా నీటి తుంపర్లే.
[ఈ కవిత 19 జులై 2009 నాడు వార్త ఆదివారం సంచికలో ప్రచురితమైంది]


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home